ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికలు అమెరికా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. గత 20 సంవత్సరాలుగా తానా కార్యక్రమాల్లో పాల్గొని 12 సంవత్సరాలకు పైగా అనేక పదవులు చేపట్టిన శ్రీనివాస గోగినేని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా 2015-17 తానా ఫౌండేషన్ చైర్మన్‍గా శ్రీనివాస గోగినేని చేసిన చేసిన సేవలు అందరికీ తెలిసినవే. అమెరికాలోని సుమారు 20 రాష్ట్రాల్లో ‘‘మన ఊరికోసం’’ నినాదంతో మొదలుపెట్టి చేసిన 5కే రన్స్ కార్యక్రమాల మూలంగా తానా అందరికి చేరువ అయింది. దీని ద్వారా సమీకరించిన కోట్లాది రూపాయలను తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలకు వినియోగించారు.
చైతన్య స్రవంతి కార్యక్రమం ద్వారా కంటిచూపు క్యాంపులు, కాన్సర్ నివారణ క్యాంపులు, గ్రహణం మొర్రి సర్జరీస్, డిజిటల్ మరియు పుస్తక లైబ్రరీస్, రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, విద్యార్థి స్కాలర్‍షిప్‍లు, వారధి ద్వారా అనేకమంది పిల్లలకు చదువులు మొదలైన కార్యక్రమాలకు ఖర్చు చేసి వేలాది మందికి ప్రయోజనం కలిగించారు. అంతేగాక తానా కాన్ఫరెన్స్ సెక్రటరీగాను, తానాబోర్డులోను, బైలాస్ కమిటీ మొదలు అనేక పదవుల్లో విశిష్ట సేవలందించారు.
తానాలో సంస్థాగతంగా నెలకొన్న పెత్తందారీ వ్యవస్థను, ధన ప్రాబల్యంతోను, బలవంతపు బ్యాలెట్ కలెక్షన్స్ తో నిర్వహించే ఎన్నికల తంతును బహిరంగంగా విమర్శిస్తుంటారు. ఇప్పుడు కూడా ‘‘తానా మనందరిదీ’ అంటూ పోటీ చేస్తూ తానా ను అంతా గర్వపడేలా చేయడంలో తనతోపాటు కలిసిరావాలని తానా సభ్యులను శ్రీనివాస గోగినేని కోరుతున్నారు.